“ముస్లింలందరూ ఒక్కచోటే ఉంటారు – అక్కడికి మనం వెళ్ళను కూడా వెళ్ళలేము – రోడ్డు మీద ఒక్కడే ఉంటాడు – మనం నలుగురమున్నా వాడే డామినేట్ చేస్తాడు – ఏందిది? అనే భావన, జనరల్ సెక్యులర్ హిందువుల్లో కూడా కలుగుతుంది”
పై మాటలన్నది ఎవరో గెస్ చేయండి..?
ఆ మాటలన్నది ఏ బీజేపీ నాయకుడో, ఫేస్ బుక్కులో ఫేక్ ఐడీతో ముస్లింలపై విషం చిమ్మే ముసుగు వీరుడో కాదు.
-ప్రొఫెసర్ నాగేశ్వర్. అవును.. మంచి విశ్లేషకుడు, ఉన్నత విద్యావంతుడు, తటస్థుడు – అని చాలా మంది భావించే ప్రొ.నాగేశ్వరే – ముస్లింల గురించి సమాజంలో/మెజారిటీల్లో ఇలాంటి అభిప్రాయం ఉందని ఓపెన్ గానే సెలవిచ్చారు. ఆ వీడియో లింక్ – యూటూబ్ లో – “అక్బరుద్దీన్ ఒవైసీ పై లౌకిక వాదులు నోరు మెదపాలి” అని టైప్ చేస్తే 5 నిమిషాల వీడియో వస్తుంది. దాన్లో 3 వ నిమిషం దగ్గర ఈ మాటల్ని వినొచ్చు.
ఆ వీడియోని 90 వేలమంది పైనే చూశారు. దానికింద 700+ కామెంట్లు ఉన్నాయి. దాదాపు అన్నీ ఓవైసీని/ముస్లింలను తిడుతూనే.
ఇంతకీ నాగేశ్వర్ ఏ కాంటెక్స్ట్ లో అలా మాట్లాడాడు..?
అక్బరుద్దీ ఓవైసీ కరీం నగర్ లో, జులై 25, 2019 న, ఓ ప్రసంగం చేశాడు. – దానిలో అతను హిందువుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని తెలుగు మీడియా, జాతీయ మీడియా హంగామా చేశాయి. ఆ విషయంపై కామెంట్ చేస్తూ – నాగేశ్వర్ పై వ్యాఖ్యలు చేశారు.
అక్బరుద్దీన్ చేసిన పూర్తి ప్రసంగం కూడా యూటూబ్ లో ఉంది. DeccanDigest అనే YouTube చానల్ దానిని లైవ్ స్ట్రీమింగ్ చేసింది. “Akbaruddin Owaisi full speech from Karimnagar” అని ఆ ఛానెల్ డాటాబేస్ లో సెర్చ్ చేస్తే పూర్తి ప్రసంగం వస్తుంది.
ప్రసంగంలో ఏముంది ?
===
56 నిమిషాల ప్రసంగంలో, మొదటి 16 నిమిషాలూ – ఆయన MIM
చరిత్రను చెప్పుకొచ్చారు. తెలంగాణా రాజ్యం భారత దేశంలో విలీనమైనప్పటి సంగతులు, ఆపరేషన్ పోలో పేరుతో అప్పుడు జరిగిన దారుణాలూ, ముస్లింలపై జరిగిన దాష్టీకాల గురించి చెప్పారు. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ, తన పూర్వీకులు ముస్లింల పక్షాన ఎలా నిలబడ్డారో వివరించారు. చైనా యుద్ధం సమయంలో, నిజాం విరాళంగా ఇచ్చిన బంగారు నిల్వల గురించీ, సైన్యంలో పాల్గొనాలని తన తండ్రి ముస్లిం యువకులకు ఇచ్చిన పిలుపుగురించీ చెప్పి, తమకు దేశంపై ఎంత ప్రేమ ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. ముస్లిమేతరులు కూడా MIM లో ఉన్నారనీ, వారిపై ఎలాంటీ వివక్ష చూపకుండా, తమ పార్టీ సెక్యులరిజానికి ఎలా కట్టుబడి ఉందో వివరించారు.
అనంతరం, ప్రస్తుత సమాజంలో ముస్లింల స్థితిగతులపై మాట్లాడారు. ప్రస్తుత ముస్లింల దయనీయ పరిస్థితికి ముందుగా నిందించాల్సింది ముస్లింలనే నని చెప్పారు. ప్రవక్త మూసా(pbh) మరియు మహమ్మద్ ప్రవక్తల జీవితాల్లోని వివిధ సంఘటనల్ని వివరించి , ప్రవక్త బోధనల ఆధారంగా జీవిచడమే ప్రస్తుత ముస్లింలు చేయాల్సిన పని అని చెప్పారు. నమాజ్, ఉపవాసాలూ మాత్రమే కాకుండా – బీదవారినీ, అనాధల్నీ ఆదరించాలనీ, అలా చేసేవారే నిజమైన ముస్లిం అనీ పదే,పదే చెప్పారు. ఆ విధంగా తరువాతి 20 నిమిషాల ప్రసంగం, ఓ మతపెద్ద ప్రసంగం లాగానే నడిచింది.
అనంతరం – ఆయన ప్రస్తుతం దేశంలో ప్రతి వ్యక్తినీ, ముఖ్యంగా ముస్లిం లను, కలిచివేస్తున్న, అభద్రతా భావానికి గురిచేస్తున్న – మాబ్ లించింగ్, గోగ్రవాదుల దాడుల గురించి మాట్లాడారు. ఈ దాడుల విషయంలో , ఏం చేయాలని చెప్పారనేది చాలా ముఖ్యమైన అంశం. ఆయన ఇలాంటి దాడుల నుండీ తప్పించుకోవడానికి, ప్రతిదాడులకు దిగమనిగానీ, కనీసం ఆత్మరక్షణకోసం పోరాడమని గానీ చెప్పలేదు. ఓ వ్యక్తి ఇస్లాం కారణంగా చంబపబడితే – అది వీరమరణం పొందటంతో సమానం అనీ – అలాంటి వ్యక్తికి కశ్చితంగా స్వర్గ ద్వారాలు తెరవబడతాయనీ, అలాంటీ చావే తనకు రావాలని కోరుకుంటాననీ చెప్పారు. చావు ప్రతి మనిషికీ ఏదో ఓ సమయంలో,ఎలాగోలా వచ్చే తీరుతుందనీ – అలాంటిదీ ఇస్లాం కోసం, ఇస్లాం కారణంగా చనిపోవడమనేదాన్ని ఓ అదృష్టంగా ముస్లింలు భావిస్తారనీ చెప్పాడు. ఓ గోగ్రవాదులారా.. ఎంతమందిని చంపుతారో చంపుకోండి – మేం చావుకు భయపడేవాల్లం కాదు. చావుకు ఎప్పటికీ సిద్ధపడే ఉన్నాం. మీరు ఏం చేసినా, మేం నవ్వుతూనే నిలబడ్తాం. కానీ, మీరు చెప్పిన నినాదాలు మాత్రం మేం ఎప్పటికీ ఇవ్వం. ప్రాణం ఉన్నంతవరకూ – మా నినాదం ఒక్కటే – అది -” సృష్టికర్త ఒక్కడే, మహమ్మద్ ఆయన ప్రవక్త” అనేది. మా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ – ఈ నినాదం మా పెదాలపై ఎప్పటికీ నిలిచి ఉంటుంది”. భయపడేవారినే, సమాజం భయపెట్టాలని చూస్తుంది. భయపెట్టేవారిని చూసి, సమాజమే భయపడుతుంది. – కాబట్టి ముస్లిం యువకులు – ఎప్పటికీ,ఎవరికీ భయపడొద్దని ఆయన హితవు పలికారు.
ఇక ఓవైసీ చివరి 10 నిమిషాలు ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాట్లాడారు. ముస్లింలలో ఐకమత్యం లేకపోవడం వల్లే, ఓట్లు చీలిపోయి బీజేపీ గెలిచిందనీ, పరిస్థితి ఇలాగే ఉంటే, రాబోయే మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆపార్టీ గెలిచి మేయర్ పదవి చేజిక్కించుకుంటుందనీ హెచ్చరించారు. ముస్లింలలో అనేక రకాల తెగలు, గ్రూపులూ పుట్టుకొచ్చాయనీ, అలాంటి గ్రూపులు కట్టేవారెవరికీ MIM లో స్థానం లేదనీ, కేవలం ముస్లిం లకోసం నిజాయితీగా పనిచేసే సంకల్పం ఉన్నవారే పార్టీలో ఉండి, మిగతావరందరూ పార్టీ వదలి వెళ్ళండని మందలించి ప్రసంగం ముగించారు.
ఈ మొత్తం ప్రసంగంలో వివాదాస్పదంగా అనిపించే సంధర్భం ఒకే ఒకటి. అది – 45 వ నిమిషం వద్ద – ” గోగ్రవాదులు, భజరంగ్ దల్, ఆర్ యెస్ యెస్ లు ఎవరూ, వెంట్రుక కూడా పీకలేరు. వీరికి ఎందుకు నేనంటే అంత ద్వేషం. బంగారు పని చేసేవారు 100 దెబ్బలు కొట్టినా ఒక్కటే, ఇనుము పని చేసేవాడు ఒక్క దెబ్బ కొట్టినా ఒక్కటే( హిందీ సామెత) . 15 నిమిషాల ప్రభావం.. ఇప్పటికీ పోలేదు. ఇదీ ధైర్యమంటే. మీ నాయకుడే ఇంత ధైర్యంగా ఉన్నాడు కాబట్టి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. “
ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గోగ్రవాదుల దాడుల గురించి భయపడొద్దని, ధైర్యం చెప్పే ప్రయత్నంలోనే ఆ మాటలు అన్నాడని – స్పీచ్ మొత్తం విన్నోల్లకు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
===
తెలుగు మీడియా దీనిని ఎలా ప్రజంట్ చేసింది?
“మళ్ళీ హిందువుల్ని రెచ్చగొట్టే ప్రసంగం ఇచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ”!! – ఈ అర్థం వచ్చేలా 24 గంటల తెలుగు న్యూస్ ఛానెల్లు, తెలుగు ప్రింట్ మీడియా వార్తల్ని వండి వార్చాయి. గంటలు, రోజుల కొద్దీ టివీ స్టూడియోల్లో డిబేట్లు నడిపాయి. అంటే, తెలుగు మీడియా ప్రకారం – బీజేపీ,ఆర్ యెస్ యెస్, భజరంగ్దల్, గోగ్రవాదులు.. వీరిని ఏమైనా అంటే – మొత్తం హిందువుల్ని అన్నట్లే నన్నమాట. వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే, హిందువుల్ని రెచ్చగొట్టడం అన్నమాట. ఇదీ తెలుగు మీడియా, తెలుగు జర్నలిస్టుల దివాలాకోరుతనం.
తటస్థ విశ్లేషకులంట!!
ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు, సోకాల్డ్ తటస్థ విశ్లేషకులుగా ప్రతి టీవీ ఛానల్ లోనూ కనిపిస్తుంటారు. ఈయన చేసిన దేడ్ దమాక్ విశ్లేషణ అత్యంత దారుణంగా ఉంది. అక్బరుద్దీన్ ప్రసంగం ‘దుర్మార్గమైనదిగా ‘ ఆయన డిక్లేర్ చేసేశాడు. కరీంనగర్ యస్పీ కమలాకర్ రెడ్డి గారు – తాము లీగల్ ఎక్స్పర్ట్స్ తో అకబరుద్దీన్ ప్రసంగాన్ని క్షున్నంగా విష్లేషించామనీ, దానిలో చట్టవ్యతిరేకమైనదేదీ లేదని తేలిందనీ ప్రకటించిన తర్వాత కూడా, ఈయన తన డిటెక్టివ్ అనలైసిస్ ను ఆపలేదు. MIM పార్టీతో , TRS కు ఉన్న మైత్రి వల్ల, ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదంట, ఇదే స్పీచ్ ఎవరైనా హిందూ నాయకులు ఇచ్చి ఉంటే, ఈపాటికి ఏదేదే జరిగిపోయుండేది – అని విపరీత విశ్లేషణలు చేసేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు నిత్యం చేసే దారుణమైన వ్యాఖ్యల గురించి ఈయనకు తెలీదనుకోవాలా? అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కనీసం ఈగైనా వాలుతుందా? ఇవన్నీ ఈయనకు తెలీదా?
పనిలో పనిగా, ఇతర సెక్యులర్ వాదులు అక్బరుద్దీన్ స్పీచ్ పై మాట్లాడరంట, కాబట్టి వారు సెక్యులరిస్టులు కాదంట – ఈయనొక్కడే నికార్సైన సెక్యులరిస్టు కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడంట. ఇదీ ఆయన వాదన. ఈయన కనీసం ఒక్కసారి కూడా అక్బరుద్దీన్ స్పీచ్ వినలేదనీ, ఇతర మీడియా చేసే అడ్డగోలు వాదనల్నే, మరో యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశారనీ, ఈయన మాటల్ని బట్టి తెలిసిపోతుంది.
ఈ వివాదం ఎందుకు, ఎవరికి ఉపయోగం?
తెలుగుమీడియాలో పనిచేస్తున్న వారికి, రాష్ట్రం లో చాలా మందికి హిందీ/ఉర్దూ రాకపోవడం ఈ వివాదానికి ప్రధాన కారణం.
ఆయనేం మాట్లాడితే మాకేం, మాకు కావలసింది – బ్రేకింగ్ న్యూస్ వేసి, ఆపై హాట్,హాట్ డిబేట్లు పెట్టీ , టీఆర్పీ,పాపులారిటీ పెంచుకోవడం -అనే మీడియా కక్కుర్తి, దివాలాకోరుతనం మరో కారణం.
సెక్యులరిస్టులందరూ ముస్లింల పక్షం వహిస్తున్నారనే, నాగేశ్వర్ వంటి దిక్కుమాలిన విశ్లేషణల వల్ల TRS,కాంగ్రెస్,టీడీపీ,వైసీపీ వంటి పార్టీలకు తీరని నష్టం. బీజేపీ కి మాత్రం తిగురులేని లాభం. ఎన్నికలకు ఒకటి,రెండు రోజుల ముందు, ఇలాంటి వీడియోల్ని వాట్సప్పుల్లో, ఫేస్ బుక్కులో సర్కులేట్ చేసి, మెజారిటీ ఓటర్లను ఎలా ఆకర్షించవచ్చో ఆపార్టీకి బాగా తెలుసు. భవిష్యత్తులో అదే జరగబోతుంది.
అసలు ఈ న్యూస్ మొత్తం అక్బరుద్దీన్ స్పీచ్ గురించైతే – దీన్లోకి ముస్లిం లందర్నీ ఎందుకు లాగాల్సొచ్చింది? ముస్లింల గురించి నాగేశ్వర్ ఏమన్నాడో మల్లీ చూద్దాం –
“ముస్లింలందరూ ఒక్కచోటే ఉంటారు – అక్కడికి మనం వెళ్ళను కూడా వెళ్ళలేము”
==
ముస్లింలకు చాలా చోట్ల అద్దెకు ఇల్లు ఇవ్వరు. ఇది జగమెరిగిన సత్యం. పొరపాటున ఇచ్చినా, అనేక యక్ష ప్రశ్నలడిగి, బీఫ్ తినకూడదు, నాన్ వెజ్ వండకూడదు వంటి ఆంక్షలు విధిస్తారు. ఈ టార్చర్ ఎందుకులెమ్మని, చాలామంది ముస్లింలు, ముస్లిం ఏరియాల్లోనే ఉండటానికి ఆసక్తి చూపిస్తారు. దీనినే ఘెట్టోఇజేషన్ అంటారు. ముస్లింలు ఒంటరిగా దొరికితే, ఏదో వంకతో వారిని కొట్టిచంపటం,వారి ఇండ్లలోకి చొరబడి ఫ్రిడ్జ్ లలో ఏముందో వెతకడం సాధారణమైపోయిన ఈరోజుల్లో, ఈ ఘెట్టోఇజేషన్ మరింత ఎక్కువవుతుంది. ముస్లింలు ఈ ఘెట్టోఇజేషన్ బాధితులేతప్ప, ఇది వారికై వారు పెట్టుకున్న కిరీటం కాదు. ముస్లిం ల ఘెట్టోలు, పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలతో పోల్చితే అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంటాయి. చాలా వరకూ ప్రాధమిక సౌకర్యాలు కూడా ఉండవు. ఇలాంటి ఏరియాలకు ముస్లిమేతరులులెవరూ వెల్లాలని ఆసక్తి చూపరు. కాబట్టి, ముస్లిమేతరుల్ని రానీయకపోవడమనే అపవాదు అర్థరహితం. నాగేశ్వర్ గారు, ఏ ఏరియాలోకి వెళ్ళాలని ప్రయత్నించారో, ఎవరు రానీయలేదో డీటైల్డ్గా చెప్తే, మనం విని తరించొచ్చు.
==
“రోడ్డు మీద ఒక్కడే ఉంటాడు – మనం నలుగురమున్నా వాడే డామినేట్ చేస్తాడు”
రోడ్డు మీద డామినేట్ చేయడమంటే ఏంటి? ముస్లింలందరికీ కరాటే, కుంగ్ ఫూ వచ్చు కాబట్టి, సినిమాల్లో హీరో ఒక్కడే నలుగుర్ని గాల్లోకి ఎగిరేసి కొట్టినట్టు, ముస్లింలు కనబడిన వారినందరినీ కొడుతుంటారనా? రోడ్డుకడ్డంగా నిలబడి హారన్ కొట్టినా సైడ్ ఇవ్వరనా? మరి అలా చేస్తుంటే, పోలీసులేం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో ముస్లింలు ఈడ్చికొడితే 5 శాతం కూడా లేరు కదా. మరి వారెందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? పోలీస్ యూనిఫారం వేసుకోగానే, హిందువులు కూడా ముస్లిం పక్షపాతులుగా మారిపోతున్నారా? మాబ్ లించింగ్ పేరుతో, ముస్లింలను నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపి, ఆ దృశ్యాలను సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నా, ముస్లింలు ఏమీ చేయలేక, చేతులు ముడుచుకుని కూర్చున్నారు. చాలా సంధర్భాల్లో, ఆ బాధిత ముస్లింలపైనే కేసులు కూడా బనాయించినా, ఏమీ చేయలేని పరిస్థితి ముస్లింలది. ఇలాంటివి నిత్యం చూస్తూ కూడా, ముస్లింలు డామినేట్ చేస్తున్నారని చెప్పడం, నాగేశ్వర్ లాంటి వారికే చెల్లింది.
ఇలాంటి మాటలు చెప్పే నాగేశ్వర్ లు మనకు నిత్యం కోకోల్లలుగా కనిపిస్తుంటారు. బహుశా, వీరు చెప్పే – ‘డామినేషన్ ‘ అనే పదాన్ని మనం మరో రకంగా కూడా విశ్లేషించొచ్చు. ‘మనుషులందరూ సమానమే’ అనే అంశాన్ని ఇస్లాం బల్లగుద్ది చెప్పడమే కాకుండా, అడుగడుగునా ఆచరణలోనూ చేసి చూపుతుంది. ఓ కారుకు ఓనరైనా, దాని డ్రైవర్ అయినా వ్యక్తిగతంగా ఇద్దరి విలువా,హోదా ఇస్లాం ప్రకారం సరిసమానం. అందుకే ఆర్థికంగా ఎంత పేదవాడైనా, ఓ ముస్లిం వ్యక్తి ఏ మాత్రం ఆత్మగౌరవం కోల్పోకుండా జీవిస్తుంటాడు. పది మంది సూట్,బూట్ వేసుకున్న వారి మధ్యలో కూడా, ఓ సాధారణ, పేద ముస్లిం దర్జాగా,వారితో సరిసమానంగా నిలబడి నమాజ్ చేస్తాడు. అట్లే, “అల్లా ఓ వ్యక్తికి మంచి చేయాలనుకుంటే- దానిని ఆపే శక్తి ఏదీ ప్రపంచంలో లేదు, అల్లా ఓ వ్యక్తికి కీడు చేయాలనుకుంటే, దానిని తప్పించే శక్తి ప్రపంచంలో ఏదీ లేదు” – అనేది ఇస్లాం యొక్క ప్రాధమిక అంశాలలో ఒకటీ. అందుకే – చాలావరకూ ముస్లింలు, తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ భయపడకుండా, ఆందోళనపడకుండా – ‘ఏదైతే అదవుతుందని’ – ధైర్యంగా, స్థిరంగా ఉంటారు. ఇస్లాం గురించి తెలీని చాలామందికి ఇది – డామినేషన్ లా అనిపిస్తుంటుంది.
మతం ప్రైవేటు వ్యవహారమనీ, దాని గురించి మాట్లాడకపోవడం ఉత్తమ లక్షణమనీ ప్రొజెక్ట్ చేయడం వల్ల, చాలా మంది సో కాల్డ్ ‘మంచి ముస్లింలు ‘ దాని గురించి మాట్లాడం మానేశారు. కానీ, దీనికి ప్యారలల్ గా, ముస్లిం ద్వేషాన్ని చెడ్డీ సంఘాలు గత నాలుగు-ఐదు దశాబ్ధాలుగా, చాలా నిష్టగా, పద్ధతి ప్రకారం ప్రచారం చేశాయి. అన్ని రకాల మీడియానీ దీనికోసం వాడుకున్నారు. అమెరికా పెట్రోల్ రాజకీయాలూ, గల్ఫ్ దేశాల్లోని రాచరిక ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలూ దానికి ఉపకరించాయి. ఫలితంగా – ముస్లింలపై నెగెటివ్ ఫీలింగ్ ఉన్న జెనెరేషన్ తయారైంది. ఈ జనరేషనే పోలీసులు,మిలిట్రీ,న్యాయ శాఖ, ఐఏయెస్,ఐపీయస్ లాంటి అన్నిచోట్లా ఉన్నారు.ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి తటస్థులు, ఉన్నత విద్యావంతుల్లోనే ఈ స్థాయిలో ఇస్లామోఫోబియా ఉన్నప్పుడు, ఇక ఇతర సాధారణ ప్రజానీకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని ఫలితాన్ని ప్రస్తుతం ముస్లిం సమాజం అనుభవిస్తోంది.
దీనికి ఏకైక పరిష్కారం, ముస్లింలు – ఇస్లాం ని సరైన పద్దతిలో అర్థం చేసుకుని, ఆచరణలో చేసిచూపడమే కాకుండా, – ఇస్లామోఫోబియా సమాజంలో ఎలా పనిచేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. సమాజంలోనూ,రాజకీయాల్లోనూ దీనిప్రభావం తగ్గించడానికి సంఘటితంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.