సెక్యులరిజం – ముస్లిం వోట్ – ఓవైసీ – పార్ట్2
============================
ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో – మోడీ ప్రతి మీటింగ్ లోనూ ఓ మాట చెప్పాడు. అది- “కాంగ్రెస్ గెలిస్తే, సోనియా సలహాదారూ, గుజరాత్ రాష్ట్రానికి చెందిన -అహ్మద్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి అవుతాడు. అలా జరగడం మీకు సమ్మతమేనా” – అని ప్రేక్షకుల్ని అడిగేవాడు.
సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థిని విమర్శించడానికి, అతను అవినీతిపరుడనో, అతనిపై కేసులున్నాయనో ప్రచారం చేస్తారు. కానీ, మోడీ, అహ్మద్ పటేల్ ని విమర్శించేటప్పుడు, ఇవేమీ అనలేదు. కేవలం ‘అహ్మద్ మియా ముఖ్యమంత్రి కావడం మీకు సమ్మతమా’ అని ప్రతిచోటా ఆవేశంగా అడిగేవాడు.
ఓ దేశ ప్రధానమంత్రి, ఓ రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకోసం, బహిరంగంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, EC, కోర్టులు,చట్టాలూ ఏమైనా చేస్తాయేమోననే ఇసుమంతైనా భయం లేకుండా ఓ వ్యక్తి యొక్క ముస్లిం ఐడెంటిటీ గురించి అంతలా విషం చిమ్మాక, మీడియా, EC, కోర్టులూ.. ఇవన్నీ అదో మామూలు విషయమే అన్నట్లు, తమకేం పట్టనట్లున్నాక… ఇక ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడటానికి ఇంకేం మిగిలి ఉంది?
ఐనా సరే, ఇంకా కొందరు ఆశావహులకు సెక్యులరిజం మీద ఆశలున్నాయి కాబట్టి మాట్లాడుకోకతప్పదు. పాశ్చాత్య దేశాల్లో సెక్యులరిజం అంటే – ప్రభుత్వ కార్యక్రమాల్లో మత ప్రసక్తి లేకపోవడం. కానీ, మన భారత రాజ్యాంగం ప్రకారం – సెక్యులరిజం అంటే – అన్ని మతాల్నీ సమాన దృష్టితొ చూడటం. అయితే, ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా కలిగిన రాజకీయ పార్టీలు – ఈ సెక్యులరిజాన్ని తమకు తోచిన విధంగా నిర్వచించుకున్నాయి. కొన్ని పార్టీలకు సెక్యులరిజం అంటే – ఏ మతం వారి దగ్గర ఆ మతానికి సంబంధించిన మాటలు మాట్లాడి, అన్ని మతాలవారి ఓట్లనూ పొందే ప్రయత్నం చేయడం. మరి కొన్ని పార్టీలకు మాత్రం – సెక్యులరిజం అంటే – మైనారిటి, మెజారిటీ ల మధ్య స్పష్టమైన విభజనని తెచ్చి, మైనారిటిలను మెజారిటీలకు శత్రువులుగా, బూచిగా చూపి, మెజారిటీల ఓట్లను పొందాలని చూడటం.
మొదటి కేటగిరీ పార్టిలతో ఎవరికీ ప్రత్యేకంగా వచ్చే లాభం లేదు, నష్టం లేదు. కానీ, రెండో కేటగిరీ పార్టీ తో మాత్రం ముస్లింలు,క్రైస్తవులు, అగ్రవర్ణ హిందువులు కాని వారందరికీ తీవ్ర ముప్పు పొంచి ఉంది. అది ఈ నాలుగేళ్ళలోనే తేటతెల్లమైంది.
తమను తాము సెక్యులరిస్టులుగా చెప్పుకునే మొదటి రకం పార్టీలు, రాజకీయాధికారం పొందటానికి అవసరమైతే మతతత్వపార్టీతో పొత్తుపెట్టుకోవడానికి ఏమాత్రం సంకోచించవని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది.అవన్నీ పార్ట్-1 లో రాసి ఉన్నాను. స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడున్నది సాఫ్ట్ హిందుత్వ మరియు హార్డ్ హిందుత్వ … ఇవి రెండే.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు, ఇతర మైనారిటీలు ఏం చేయాలి?
ప్రతిసారీ, తమ ఓటును, సెక్యులరిజం గురించి కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీకి సమర్పించుకుని, తమ తరుపున వారు సెక్యులరిజంకై నిలబడాలనుకోవడం, గాలిలో దీపం వెలిగించి అది ఎప్పటికీ వెలుగుతుండాలని ఆశించడం లాంటిదే.
దీనికి ఏకైక పరిష్కారం – ముస్లింలందరూ సంఘటితమై తమ ఓటును సమర్థవంతంగా ఉపయోగించడమే. కేవలం 1, 2 శాతం ఓట్ల తేడాలే జయాపజయాల్ని నిర్దేషిస్తున్న తరుణంలో, 15% ఉన్న ముస్లిం ఓట్లు సంఘటితమైతే దాని ప్రభావం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ ఆ 15%, ఒకే దగ్గరలేకుండా అక్కడక్కడా చెల్లాచేదరుగా ఉన్నరు కాబట్టి, వాటి వల్ల ఉపయోగం ఉండదని ఎవరైనా అనుకోవచ్చు. దీనికి సమాధానం ఓట్ల బిందు సేద్యం- డ్రిప్ ఇరిగేషన్.అదేమిటో తర్వాత చూద్దాం.
ముస్లిం పార్టీ ఎలా ఉండకూడదు? క్యూరియస్ ‘కేస్’ ఆఫ్ ఓవైసీ:
======================================
అసదుద్దీన్ ఓవైసీ:
ముస్లింలపట్ల ఏమిటీ సవతి తల్లి ప్రేమ, ఎందుకీ వివక్ష.. అని పార్లమెంట్లో, ప్రభుత్వాన్ని నిలదీసిన అడిగిన ఒకే ఒక్క నాయకుడు .
“అవును నేను ముస్లిం నే, ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తూ, ఖురాన్ ని గుండెల్లో నింపుకుని, భారత రాజ్యాంగానికి కట్టుబడి జీవించే ముస్లిం నే. అలాగే జీవిస్తాను, అలాగే చస్తాను” – అని ఏ టీవీ స్టూడియోలో అయినా, ఎవరి ముందైనా ధైర్యంగా చెప్పగలిగిన ఒకే ఒక్క నాయకుడు.
ఇస్లాం గురించే కాకుండా, భారత రాజ్యాంగ, చట్టాల గురించి కూడా మంచి పట్టున్న నాయకుడు.
MIM హెడ్క్వార్టర్ అయిన దారుస్సలాం కి, వివిధ పనులపై వచ్చి, ఎలాంటి వివక్షలకూ గురికాకుండా, తమ ముస్లిం ంళాల ద్వారా పనులు చేయించుకుని వెల్లే పాతబస్తీ హిందూ ఓటర్లని చాలా మందిని నేను ప్రత్యక్షంగా చూశాను.
TVస్టూడియోల్లో, ఎవరు ఎలాంటి ప్రశ్నలడిగినా ఏమాత్రమూ తడబడకుండా, ఎక్కడా లాజిక్ మిస్సవకుండా, అడిగిన వారి నోల్లు మూయించే అసదుద్దీన్ ఓవైసీ , ఒక్క ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తోకముడుస్తారు. అది అతని తమ్ముడి – విద్వేషపూరిత స్పీచుల గురించి. అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దానిగురించి మాట్లాడబోనని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.
MIM , బీజేపీ కి సహాయం చేస్తుందా..?
========================================
వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో పోటీ చేసి, ఓట్ల చీలికకు కారణమై, BJP గెలుపుకు దోహదం చేస్తున్నాడనీ, BJPతో కుదిరిన లోపాయికారీ ఒప్పందం కారణంగానే ఇదంతా చేస్తున్నాడనీ, ఓవైసీని కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీలతో పాటు, కొందరు ముస్లింలు కూడా తరచుగా విమర్శిస్తుంటారు. దీని మూలాల్లోకి వెలితే –
యతిన్ ఓజా – ఇతను గుజరాత్లో ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. గతంలో రెండు సార్లు MLAగా ఎన్నికయ్యాడు. మోడీ, అమిత్ షాలకు సన్నిహితుడిగా పేరుంది. మధ్యలో కొన్నేల్లు కాంగ్రెస్ లోకి కూడా మారి మళ్ళీ BJPలోకి చేరి, ఆ తర్వాత కేజ్రీవాల్ పార్టీలోకి చేరిపోయారు. కేజ్రీవాల్ పార్టీలోకి వెల్లడానికి అతను చెప్పిన కారణం – ” సెప్టెంబర్ 15, 2015 నాడు , తెల్లవారు ఝామున 3 గంటలకు, అమిత్ షా ఇంట్లో – అమిత్ షాకి-అసదుద్దీన్ ఓవైసీకి మధ్య ఓ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో, కొన్ని రోజుల్లో జరగబోయే బీహార్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ BJPకి ఎలా సహాయం చేయాలి, ఎలాంటి విద్వేషపూరిత స్పీచులివ్వాలి వంటి అంశాల మీద వీరిద్దరికీ ఓ ఒప్పందం జరిగింది. ఈ మీటింగ్ కి నేను కూడా వెళ్ళాను. పైకి బద్ధ శత్రువులుగా కనిపించే వీరిరువురూ లోలోపల చేస్తున్న ఈ నీచ రాజకీయం గురించి తెలిసి అప్పుడే నా మనసు విరిగిపోయింది. అందుకే పార్టి మారి కేజ్రీవాల్ పార్టీలోకి వెల్తున్నానని చెప్పాడు. ఓవైసీ ఏ ప్రతిఫలం ఆశించి ఇదంతా చేస్తున్నాడు, అతనికి ఏం ఆశ చూపారు వంటి అంశాల్ని మాత్రం అతను చెప్పలేదు.
ఈ యతిన్ ఓజా గత చరిత్ర, ఇతను చేసిన పార్టీ జంపింగ్లు చూస్తే, ఇతనేమాత్రం నమ్మదగిన వ్యక్తిలా అనిపించలేదు కాబట్టి, నాకు అతని మాటలు అంత నమ్మశక్యంగా అనిపించలేదు.
కాకపోతే, కొన్ని రోజుల క్రితం ఓ రిటైర్డ్ ప్రభుత్వాధికారితో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు, ఈ అంశం చర్చకు వచ్చింది. అతను ఓజా చెప్పింది నిజమే అనడంతో ఆశ్చర్యపోయాను.
” అదే నిజమైతే, ఓవైసీ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నట్లు? డబ్బు కోసం అతను ఇలాంటి పనికి పూనుకుంటాడని నేననుకోను” – అన్నాను.
దానికి ఆయన -“నిజమే. ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాదు. అతని తమ్ముడి కేసులతో ముడిపడిన వ్యవహారం. తమ్ముడ్ని కాపాడటం కోసం అతనికి చేయక తప్పడం లేదు” – అన్నారు.
“కేసులు కింది కోర్టులో ఉన్నాయి. చార్జ్ షీట్ ఫైల్ చేయడం.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కదా ఉన్నాయి. అంటే KCR చేతిలో. TRS-MIM సంబంధాలు ఎలాగూ బలంగానే ఉన్నాయి. ఇక ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏముంది” – అన్నాను.
ఆయన నవ్వేసి -” సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటుంటుంది. వీరు రాష్ట్ర ఇంటెలిజెన్స్, హోం శాఖలకు పంపే రహస్య రిపోర్టుల ఆధారంగా చాలా జరుగుతుంటాయి.” అని చెప్పి సడెన్ గా ఆ డిస్కషన్ ని ఆపేశారు.
BJP-MIM మధ్య అలాంటి ఒప్పందం జరిగిందా లేదా అనేది కేవలం అల్లా కెరుక. కానీ, హేట్ స్పీచ్ ల విషయంలో అసదుద్దీన్ వైఖరిపై మాత్రం నాకు ఓ అభ్యంతరం ఉంది.
ముస్లింలకో న్యాయం- ముస్లిమేతరులకో న్యాయం ఉండదు. :
========================================
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన నాయకుల లిస్ట్ చాంతాడంత ఉంది. వారందరినీ ఏం చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తారు? వారిని విచారించి కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. విచారణ సాధ్యమైనంత త్వరితంగా పూర్తవ్వాలని కోరుకుంటాం. విచారణ పూర్తై వారు నిర్దోషులని తేలేవరకూ, అతను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీచేయకుండా ఉండాలని ఆశిస్తాం. మన నాయకునిగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వంటివారు, మన తరుపున ఇలాంటి ప్రశ్నలన్నీ అడగాలనీ కోరుకుంటాం.
మరలాంటప్పుడు, అక్బరుద్దీన్ ఓవైసీ కి కూడా ఇవన్నీ వర్తిస్తాయి కదా. తన సొంత తమ్ముని కేసులో సైలెంటుగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ కి, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవారిని శిక్షించమని అడిగే నైతిక హక్కు ఎలా ఉంటుంది?
ఇది అసదుద్దీన్ ఓవైసీని నిలదీసి అడగాల్సిన ప్రశ్న. కానీ, ఎవరు అడుగుతారు? అతనికి ఓట్లేసే ప్రజలకు అంత సీన్ లేదు. అతని పార్టీ MLAలు, ఇతర ఛోటా,మోటా నాయకులు కూడా, ఓవైసీ దయతలచి పార్టీ టికెట్లు ఇస్తే గెలిచిన వారే తప్ప, సొంతంగా ప్రజా బలం ఉన్నవారు కారు. కాబట్టి వారు కూడా అడగలేరు. మరి ఎవరు అడగాలి? తమకంటూ ఓ సిద్ధాంత ప్రాతిపదిక గానీ, అంతర్గత ప్రజాస్వామ్యం గానీ లేకుండా, వ్యక్తి/కుటుంబం ఆధారంగా నడిచే అన్ని పార్టీలకూ, ఆయా వ్యక్తుల బలహీనతల్ని, వారు చేసే అడ్డమైన పనుల్నీ వెనకేసుకురావాల్సిన అగత్యం ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. వారి ప్రత్యర్థులకి అదే కావలసిన అవకాశాల్ని సృష్టిస్తుంది. ఆ రకంగా, ఏ హిందుత్వ అల్లరి మూకలనుండీ ముస్లింలను కాపాడతానని ఓవైసీ తరచూ చెప్తుంటాడో, అదే అల్లరి మూకలు, ముస్లింలను బూచిగా చూపి రాజకీయంగా బలపడడానికి ఓవైసీ స్పీచులు దోహదం చేశాయి.
ఇక్కడ నిజాయితీగా చెప్పుకోవలసిన కొన్ని విషయాలు ఏమిటంటే – ఆ స్పీచుల తర్వాత మళ్ళీ ఎప్పుడూ, అతను అలాంటి స్పీచులు ఇచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణా ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్ దేశంలోని ప్రతి భారతీయునికీ చెందినదనీ, ‘సెట్లర్ ‘ అనే పదాన్ని నిషేధించాలనీ , అతను అసెంబ్లీ లోపల బయటా చాలా సార్లు చెప్పి ఉన్నాడు. MIM పార్టీకి ఎప్పుడూ హైదరాబాద్ లో హింసను ప్రేరేపించిన చరిత్ర లేదు. వీటన్నిటినీ కలిపి చూస్తే, కొన్ని సంఘాలూ, సేనలూ ప్రచారం చేస్తున్నట్లు MIM పార్టీ ప్రమాదకరమైంది కాదని అర్థమవ్తుంది.
ఓట్ల బిందు సేద్యమే ఇప్పుడు చేయవలసింది!!
==================================
ఎలాగైతే, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ప్రతీ నీటి బొట్టుని సంఘటితం చేసి, దానిని నేలపై పారించకుండా, నేరుగా మొక్క మొదల్లలో వదుల్తామో అలాగే ముస్లిం వోట్లు కూడా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీకి కాకుండా, అందరూ కలిసి సంఘటితంగా తమ అభ్యర్థిని నిలబెట్టడమా, లేక ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని, దానికి మద్దతివ్వడమా.. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ముస్లింలందరూ గ్రామ/వార్డు స్థాయి నుండీ చిన్న,చిన్న యూనిట్లుగా ఏర్పడి, తమలో ఒకరిని ప్రతినిధిగా ఎన్నుకుని, హైరార్కియల్ పద్దతిలో, ఓ బలమైన ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హంగూ, ఆర్భాటాలకు పోకుండా, ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తూ, దీన్-దునియా రెండింటికీ సమ ప్రాధన్యం ఇస్తున్న వారినే తమ ప్రతినిధులుగా, నాయకులుగా ఎన్నుకోవాలి. ఇదంతా, ప్రాక్టికల్గా అసలు అయ్యేపనేనా అని అణుమానం రావొచ్చుగానీ, ఈ దేశంలో తమ మనుగడకు పొంచి ఉన్న ముప్పును గ్రహిస్తే, ఆ భయం ఆటోమేటిక్గా ముస్లింలను అలాంటి ఆర్గనైజేషన్ దిశగా నడిపిస్తుంది. అలాంటి చైతన్యం త్వరగా రావాలని ఆశిద్దాం.
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in