స్త్రీ, పురుష సమానత్వం-ఎంపవర్మెంట్

“ఈమాన్ కలిగిన పురుషులు – ఈమాన్ కలిగిన స్త్రీలు,
(సృష్టికర్తపై) నమ్మకం ఉంచిన పురుషులు – (సృష్టికర్తపై) నమ్మకం ఉంచిన స్త్రీలు,
(సృష్టికర్త పట్ల) విధేయత చూపిన పురుషులు – (సృష్టికర్త పట్ల) విధేయత చూపిన స్త్రీలు,
నిజాయితీ కలిగిన పురుషులు – నిజాయితీ కలిగిన స్త్రీలు,
సహనం చూపిన పురుషులు – సహనం చూపిన స్త్రీలు,
అణుకువగా ఉన్న పురుషులు – అనుకువగా ఉన్న స్త్రీలు,
దానం (చారిటి) ఇఛ్చిన పురుషులు – దానం ఇఛ్చిన స్త్రీలు,
ఉపవాసం ఉన్న పురుషులు – ఉపవాసం ఉన్న స్త్రీలు,
శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకున్న పురుషులు –
శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకున్న స్త్రీలు,
(సృష్టికర్తను) నిత్యం తలచుకునే పురుషులు – (సృష్టికర్తను) నిత్యం తలచుకునే స్త్రీలు…
సృష్టికర్త మీ అందరికీ క్షమాపణను, మరియు గొప్ప బహుమానాన్ని సిద్ధం చేసి ఉంచాడు”
-ఖురాన్ ౩౩:35

సృష్టికర్త మనిషికి విధించిన నీతి-నియమాల్లో గాని, దానికి లభించబోయే మరణానంతర ప్రతిఫలంలో గాని, స్త్రీ-పురుషుల మధ్య ఎలాంటి తేడా లేదనే విషయం – పై ఖురాన్ వాక్యాల ద్వారా తేటతెల్లమవుతుంది.
మరీ ముఖ్యంగా, ‘అణుకువ’ స్త్రీలకు మాత్రమే ఉండాల్సిన లక్షణమని చాలా సమాజాలూ,సంస్కృతులూ ఇప్పటికీ భావిస్తాయి. కానీ, ఖురాన్ అది స్త్రీ-పురుషులిద్దరికీ ఉండాల్సిన లక్షణమని చెప్తుంది. ‘శారీరక వాంఛలు’ ఇద్దరికీ ఉంటాయనే విషయాన్ని ధృవీకరించి, ఇద్దరూ వాటిని అదుపులో ఉంచుకోవాలని బోధిస్తుంది. ఇక స్వర్గమంటే – అందగత్తెలు డ్యాన్స్ చేస్తుంటే పురుషులు ఎంజాయ్ చేసే క్లబ్ లాగా కొన్ని సంస్కృతులు ప్రొజెక్ట్ చేశాయి. కానీ ఖురాన్ బోధనలు దీనికి విరుద్ఢం.

ఖురాన్ చాలా విషయాల్లో స్త్రీ,పురుషుల్ని వేరు,వేరుగా కాకుండా – , “ఓ ఆదామ్ బిడ్డలారా” అని గానీ, “ఓ విశ్వాసులారా” అని గానీ, కంబైండ్ గానే సంబోధిస్తుంది. కొన్ని సంధర్భాల్లో మాత్రమే స్త్రీ,పురుషుల్ని వేరు,వేరుగా సంబోధిస్తుంది.
ఉదాహరణకు – సూరా 4:34 లో, “ఓ పురుషులారా – మీ భార్యలు మిమ్మల్ని ధిక్కరిస్తే”.. ఎలా డీల్ చేయాలి అనే విషయం ఉంటుంది. ఖురాన్ ని పని గట్టుకుని విమర్శించే కొందరు – ఈ పదాన్ని పట్టుకుని, ఖురాన్ ప్రకారం – స్త్రీ పురుషున్ని ధిక్కరించకూడదని ఉందనీ, ఆ రకంగా అది స్త్రీలని అణచివేస్తుందనీ – ఏదేదో రాస్తారు.
కానీ, అదే సూరా 4:128 లో – “ఓ పురుషుడు, తన భార్యని ధిక్కరిస్తే – ఆ భార్య దానిని ఎలా డీల్ చేయొచ్చో” – వివరిస్తుంది. రెండు సంధర్భాల్లోనూ వాడిన అరబిక్ పదం ఒక్కటే – ‘నుషుజన్’.

అట్లే, సూరా 9:71 కూడా ఆసక్తికరం. దీనిలో “స్త్రీ,పురుషులు ఒకరికొకరు అవ్లియా” అని ఉంటుంది. అవ్లియా కి అర్థం – ఫ్రండ్స్/సహచరులు/ప్రొటెక్టర్స్/సపోర్టర్స్ అని వస్తుంది. భార్యకి భర్త దేవుడనే కాన్సెప్ట్ తో పోల్చితే, ఖురాన్ ఈ విషయంలో ఎంత విప్లవాత్మకమో అర్థమవుతుంది.

సూరా 4:1 లో – “ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే ఆత్మనుండీ సృష్టించాము, తర్వాత స్త్రీ,పురుషులుగా విభజించాము”. అని ఉంది దీనిని బట్టి – శారీరకంగా వేరే,వేరుగా ఉన్నప్పటికీ స్పిరిచువల్ గా ఇద్దరూ ఒక్కటే అని అర్థమవుతుంది.

స్త్రీ,పురుషుల సమానత్వాన్ని ప్రవచించిన ఖురాన్ – కొన్ని విషయాల్లో మహిళలకు స్పష్టమైన ఆధిక్యతనిచ్చింది. ఉదాహరణకు – 46:15 మరియు 31:14 వాక్యాల్లో – “ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులపట్ల ప్రేమ,దయ కలిగిఉండాలని చెబుతూనే – తనకు జన్మనిచ్చే సమయంలో తల్లి అనుభవించిన ప్రసవవేదనను ప్రత్యేకంగా గుర్తుచేసి, తల్లి పట్ల మరింత ఎక్కువ బాధ్యత కలిగిఉండాలని బోధిస్తుంది.” ఈ అంశం గురించి ప్రవక్త బోధనలు కూడా చాలా ఉన్నాయి.

వెస్ట్రన్ సొసైటీస్ లో 19 వ శతాబ్ధం వరకూ స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. కానీ, 14 శతాబ్ధాల క్రితమే ఖురాన్ మహిళలకు ఆస్తి హక్కును ఇచ్చింది. దానికంటే ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అది – స్త్రీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, అది కేవలం ఆ స్త్రీకి మాత్రమే చెందుతుంది తప్ప, భర్తకు గానీ, కుటుంబానికి గానీ చెందదు. స్త్రీలు వృత్తి,ఉద్యోగాలు చేయడంపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ, భార్యా,పిల్లల పోషణ భాద్యత పూర్తిగా పురుషుడిదేనని ఖురాన్ స్పష్టంగా పేర్కొంటుంది. స్త్రీకి సొంతంగా ఆస్తి ఉండి, ఆమె స్వచ్చందంగా తన భర్త,పిల్లలపై ఖర్చుచేయాలనుకుంటే చేయొచ్చు. ఆమె దగ్గరున్న డబ్బును ఇవ్వమని అడిగే అధికారం భర్తకు గానీ, పిల్లలకు కానీ లేదు.
స్త్రీకి ఆస్తిహక్కును ఇచ్చినప్పటికీ, కొడుకుకు వచ్చే వాటాలో సగమే కూతురికి ఇస్తుంది కాబట్టి- ఇస్లాం మహిళలకి ద్రోహం చేసిందని కొందరు రాస్తుంటారు. కానీ, పైన చెప్పబడిన కుటుంబ బాధ్యత పూర్తిగా పురుషుడిపై ఉంచిన విషయాన్ని పరిగణిస్తే – స్త్రీకి సగ భాగమే ఇవ్వడం వెనక ఉన్న లాజిక్ సులువుగానే అర్థం అవుతుంది.
చదువు, విడాకులు తీసుకునే హక్కు, పరిపాలన వంటి సామాజిక వ్యవహారాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం.. ఇలా ప్రతి అంశం లోనూ స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వబడింది. ఇస్లాం రాకకు పూర్వం, అరేబియాలో ఉన్న – ‘ఆడపిల్లల్ని సజీవంగా ఇసుకలో పూడ్చిపెట్టే’ దురాచారాన్ని, కేవలం 20 సంవత్సరాల్లోనే అరేబియా ఖండం నుండీ పూర్తిగా రూపుమాపడం జరిగింది. ఇక ‘స్త్రీ ఒక పురుషున్నే చేసుకోవాలి, పురుషుడు నాలుగు వరకూ’ – అనే వెసలుబాటు కూడా – యుద్ధాల్లో అనాధలుగా మిగిలిన స్త్రీలు-పిల్లల కు సౌకర్యవంతమైన జీవితం కల్పించడం కోసమే తప్ప – పురుషులకు చెలరేగిపోవడానికి స్పెషల్ లైసెన్స్ ఇవ్వడం కాదని – ప్రవక్త కాలం నాటి అరేబియా పరిస్థితుల కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే ఈజీగానే అర్థమవుతుంది.

ఇవేవీ తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, స్త్రీ సౌందర్యం ఆధారంగా వేలకోట్ల వ్యాపారం చేసే బహులజాతి కంపెనీలు, రొమాన్స్,సెక్స్ ఆధారంగా నడిచే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలు డెపిక్ట్ చేసే స్త్రీ క్యారెక్టర్లే – వుమెన్ ఎంపవర్మెంట్ గా చాలా మంది భావిస్తున్నారు. ఈ ఇండస్ట్రీలూ, వీటి ద్వారా బ్రెయిన్ వాష్ చేయబడిన వారూ, ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందని డిక్లరేషన్లు ఇస్తుంటారు.

స్త్రీకైనా,పురుషుడికైనా… తన మనసులోని బాధల్ని,భయాల్ని,ఆందోళనలనీ, అసంత్రృప్తినీ జయించి, జీవితంపై సరైన దృక్పదాన్ని కలిగిఉండటమే అసలైన ఎంపవర్మెంట్ . అలాంటి ఎంపవర్మెంటే నిజమైన శాంతినీ,సౌఖ్యాన్నీ కలగజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published.