ఈ రోజు ఒక ఇంటరెస్టింగ్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను.ఫోటో చూస్తే తెలిసిపోయిందా..లేదు కదూ..ఎందుకంటే వీరిది చరిత్రలో అణచివేయబడ్డ పేజీ..అట్టడుగు పొరల్లోంచి లాగి.. దుమ్ము దులిపి తెలుసుకోవాల్సిన పుటలు ఇలాంటివి ఎన్నో..
1937 లో అంబేద్కర్ కి బొంబాయి అసెంబ్లీ ఎన్నికల్లో 13,245 ఓట్లు వచ్చాయి.ప్రత్యర్ధికి 11,225 ఓట్లు వచ్చాయి..ఆ ప్రత్యర్థి.. “పాల్వాన్కర్ బాలూ”.
ఈయన అప్పటికే పేరుపొందిన మొట్టమొదటి.. “దళిత క్రికెటర్’..
1892 వ సంవత్సరం..4.00 రూపాయల నెల జీతం తో పూణే క్లబ్ ఒక పదిహేనేళ్ల కుర్రవాణ్ణి పనిలో పెట్టుకుంది..ఆ అబ్బాయి పని నెట్ లు కట్టడం..పిచ్ లు మార్క్ చేయడం.గతంలో పార్శి క్లబ్ లో కూడా ఇదే పనిచేసినా ఇక్కడ ఆంగ్లేయుల కుర్రవాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బౌలింగ్ చేయమనే వారు.వందల సార్లు బౌలింగ్ చేసిన ఆ పిల్లవాడు తర్వాతర్వాత తమ టీంలనే చిత్తుగా ఓడిస్తాడని వాళ్ళు ఊహించలేదు.
అతనిది ధార్వాడ్ లోని చర్మకారుల కుటుంబం.దళితులందరినీ ..బూట్ల తయారీ కోసం.. పెద్దసంఖ్యలో సైన్యంలోకి తీసుకోవడంతో తండ్రితో పాటు పూణే వచ్చేసారు.
క్లబ్ ల లో చిన్న చిన్న పనులు చేస్తున్న బాలూ కి అతని అన్న విఠల్ కి క్రికెట్ పై ఇష్టం పెరిగింది.
ఆ రోజుల్లో పూణే లో అంటరానితనం దారుణంగా ఉండేది.బాలూ లోని నేర్పు చూసిన ‘హిందూ టీమ్’ అతనికి అప్పుడప్పుడూ ఆటకి అవకాశం అయితే ఇచ్చేది కానీ..దళితుడని ఎవ్వరూ కలిసే వారు కాదు.
విరామం లో పెవిలియన్ బయట మట్టి పాత్రలో అన్నం పెట్టేవారు.తినడం పూర్తికాగానే దాన్ని పగలగొట్టాలి.ముఖం కడుక్కోవాలన్నా..దాహంగా ఉన్నా ఒక దళిత పనివాడు కూజా తో తెచ్చేవారకూ ఆగాల్సిందే.క్రికెట్ ఆడేవాళ్ళలో ఎక్కువగా హిందూ బ్రాహ్మలూ..పారసీలూ..ఇంగ్లీష్ కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు.బాలు ఒక్కడే తనకు వేరుగా పెట్టిన ఆహారం తినేవాడు.
రామచంద్ర గుహ బాలూ గురించి ప్రస్తావిస్తూ..”ఆట కోసం దారుణమైన కుల వివక్షను ఎదుర్కొని పోరాడిన గొప్ప క్రికెటర్ ” అంటారు.
మెల్లిగా బాలు ఆటలోని స్పీడ్ ని ..నైపుణ్యాన్ని గుర్తించసాగారు.అతన్ని హిందు టీమ్ లోకి తీసుకున్నారు.
1909 ఇంగ్లండ్ తో ఆడిన మ్యాచ్ లో 8 వికెట్లు తీసుకుని..103 రన్లు చేసాడు..అతడి ప్రతిభ మారుమ్రోగిపోయింది.బాలూ ‘ఆన్ ఫీల్డ్ ‘ పవర్ చూసిన వారు మెల్లిగా తమలో కలుపుకున్నారు..అతను ఆడిన ప్రతీ మ్యాచ్ లో టీమ్ కి విజయాన్ని అందించేవాడు.కానీ కరుడు గట్టిన హిందుత్వ వాదులు అతన్ని కెప్టెన్ చేయాలంటే వ్యతిరేకించేవారు..1910 నుండి ప్రతీ సంవత్సరం.. బాలూ ని కెప్టెన్ చేయాలన్న ప్రతిపాదన వచ్చేది. MD. Pai. అప్పటి కెప్టెన్ ఒప్పుకున్నా ..D.B.Deodhar.(దేవధర్/ దియోధర్) అనే బ్రాహ్మణ యువకున్నే ఎన్నుకున్నారు.
తర్వాత రెండేళ్లకు వైస్ కెప్టెన్ అయ్యాడు.
అసలు కథ ఇక్కడే ఉంది..1910 లో బాలూ ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని రాగానే జరిగిన స్వాగత సభకు అంబెడ్కర్ ఆహ్వానితులుగా ఉన్నారు..బాలూ గురించి తెలుసుకుని స్పీచ్ లో ప్రశంసల జల్లు కురిపించారు. తరచుగా బాలూ గురించి గ్రామాల్లో చెప్పేవారు.బాలూ ని పిలిచి మాట్లాడేవారు.
అయితే హిందు క్లబ్/ టీమ్ తరపున ఆడుతున్న బాలూ గాంధీకి విధేయుడిగా ఉండేవాడు.సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలూను ‘పూనా ఒడంబడిక’ పై సంతకం చేయమని బలవంతపెట్టారు.బాలూ ఒక దళితుడి గా అంబేద్కర్ పై పోటీ కి ససేమిరా అన్నా.. గాంధీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పటేల్ ఒప్పించారు.1932 లో జరిగిన బహిరంగ సభలో తనకు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు అన్నాడు.అయిష్టంగా నే పోటీచేసి ఓడిపోయాడు.తర్వాత అంబేద్కర్ ని కలిసి క్షమించమని వేడుకున్నాడు..
మెల్లిగా అతని క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది.విజయ్ మర్చంట్ కెప్టెన్ అయ్యాడు..అటు రాజకీయ చరిత్ర లో…భారత క్రికెట్ చరిత్రలో బాలూ “లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్’ “ఫస్ట్ దళిత్ క్రికెటర్”.. అనామకంగానే మిగిలిపోయాడు.
Written By,
Smt. Rajitha kommu,
Principal, Govt.Junior College,Peddemu.Ranga Reddy