కథలాంటి నిజం; విక్టోరియా – అబ్దుల్ కరీం.
============================
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రాణి, ఈ ప్రపంచంలోని ముప్పావు వంతు భూభాగాన్ని తన కనుసన్నలతో శాసించిన సామ్రాజ్యాధినేత – బ్రిటీష్ రాణి విక్టోరియా.
అలాంటి రాణికి సేవకునిగా, ఆంతరంగకునిగా, గురువుగా, మిత్రుడిగా, సన్నిహితుడిగా,ఓ కొడుకుగా పదేల్లు బ్రిటన్ రాణి కోటలో చక్రం తిప్పిన భారతీయుడు – అబ్దుల్ కరీం.
అది 1890 సంవత్సరం.
ఇండియాలోని బ్రిటీష్ అధికారులు, తమ రాణికి చిన్న కానుకగా, షాజహాన్ కాలం నాటి ఓ నాణేన్ని పంపాలనుకున్నారు. దానిని రాణికి అందివ్వడానికి ఇద్దరు భారతీయ నౌకర్లను షిప్పులో London పంపారు. వారిలో ఒకతని పేరు- అబ్దుల్ కరీం. ఆగ్రా జైలులో ఖైదీల వివరాలు నమోదు చేసే పని చేసేవాడు. అప్పటికే ఉర్దూ,అరబిక్ భాషలపై మాంచి పట్టు ఉంది. ఖురాన్ మొత్తం బట్టీపట్టేసి ఉన్నాడు. (అలా బట్టీ పట్టిన వారిని- హఫీజ్ అంటారు.) బ్రిటీష్ వారితో రోజూ మాట్లాడుతుండటం వల్ల ఇంగ్లీష్ కూడా నేర్చేసుకున్నాడు. ఇన్ని భాషలు వచ్చి ఉండటం వల్లనే బహుశా అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు.