ఐర్లాండ్ కరువుకు తల్లడిల్లిన సుల్తాన్

ఏవరైనా ఒక ముస్లిం తప్పుచేస్తే, దానిని మొత్తం ముస్లిం సమాజానికి,ఇస్లాం కి ఆపాదించి కొన్ని తరాలపాటు జనం దానిని జనం గుర్తుపెట్టుకునేలా చేయడం- అనేది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్.కానీ, ముస్లిం లు చేసే మంచిపనులేవీ ఎక్కడా చర్చకు రావు. దీనికి మరో ఉదాహరణే ఇది.

1845 – ఐర్లాండ్ పాలిట శాపంగా మారిన సంవత్సరం. అక్కడ పంటలకు సోకిన ఒక భయంకరమైన తెగులు కారణంగా, కొన్ని సంవత్సరాలపాటు నేలనుండీ ఎలాంటి ఆహారం ఉత్పత్తి అవలేదు. ఇది తీవ్రమైన ఆహారకొరతకు దారితీసి సుమారు పది లక్షల మంది తిండిలేక చనిపోయారు. ఆర్థిక స్థోమత కలిగిన కుటుంబాలు పెద్దసంఖ్యలో అమెరికా, కెనడాలకు వలసవెళ్ళారు, మిగిలినవారు నత్తలు,కప్పలు, చివరకు గంజాయి లాంటివి.. ఏది దొరికితే అవి తింటూ దుర్భరజీవితం గడిపారు.

అప్పటి అట్టోమన్ సామ్రాజ్యపు చక్రవర్తి – ఖలీఫా అబ్దుల్ మజీద్. సుల్తాన్ ఆరోగ్య వ్యవహారాలు చూసే డాక్టర్ల టీమ్ లోని ఒక డెంటిస్ట్ ఐరిష్ వ్యక్తి. అతను ప్రతిరోజూ ముభావంగా ఉండటం గమనించిన సుల్తాన్, ఒక రోజు విషయం ఏంటని అతన్ని అడిగాడు. కరువు కారణంగా ఐర్ల్యాండ్ లో ఉన్న దుర్భర పరిస్థితుల్ని విని తల్లడిల్లిన సుల్తాన్, తక్షణమే ఐర్లాండ్ కి పదివేల పౌండ్ల విరాళాన్ని ప్రకటించాడు.

ప్రపంచంలోని అనేక దేశాల్లాగే, అప్పట్లో ఐర్ల్యాండ్ కూడా బ్రిటీష్ వారి ఆధీనంలో ఉంది. అట్టోమాన్ సుల్తాన్ ఐర్లాండ్ కి పదివేల పౌండ్లు ప్రకటించిన విషయం తెలిసి బ్రిటీష్ రాణి విక్టోరియా ఖంగుతింది. ఎందుకంటే, ఐర్లాండ్ కి ఆమె స్వయంగా ప్రకటించిన విరాళమే రెండు వేల పౌండ్లు. ఎక్కడో దూరంలో ఉన్న ఆటోమాన్ సుల్తాన్ తమకోసం బ్రిటీష్ రాణి కంటే భారిగా విరాళం ఇచ్చాడనే విషయం, ఐరిష్ ప్రజలకు తప్పుడు సంకేతాల్ని ఇస్తుందని భావించిన విక్టోరియా – “ఐర్లాండ్ లో అంత దుర్భర పరిస్థితులేమీ లేవనీ, అసలు అక్కడ అంతగా జనసంచారమే లేదనీ, కాబట్టి అంత భారీ విరాళం అవసరమే లేదని, 1000 పౌండ్లిస్తే అదే ఎక్కువని”, అట్టోమాన్ సుల్తాన్ కి రాయబారం పంపింది.

అట్టోమాన్ సామ్రాజ్యం అప్పటికే అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతుంది.పైగా, ఆయుధ సంపత్తిపరంగా బ్రిటీష్ సామ్రాజ్యంతో తలపడేంత శక్తివంతంగా కూడా లేదు. దీనితో, తాను ప్రకటించిన 10వేల పౌండ్ల సహాయాన్ని ఉపసమ్హరించుకుని, చివరకు 1000 పౌండ్లు మాత్రమే ప్రకటించాడు. కానీ, ఐరిష్ ప్రజలకు ఎలాగైనా సహాయం చేయాలన్న తపన కారణంగా, ఐదు భారీ ఓడల నిండా ఆహార ధాన్యాల్ని రహస్యంగా ఐర్లాండ్ కి పంపించాడు. ఇవి డబ్లిన్ ఓడ రేవుకు చేరగా, విక్టోరియా అనుమతి లేనిదే తాము ఎలాంటి ఓడల్నీ పోర్టులోకి అనుమతించమని అక్కడి బ్రిటీష్ అధికారులు నిరాకరించారు. చివరికి ఆ ఓడలు మరికొంత దూరం ప్రయాణించి, డ్రొగేడా అనే మరో చిన్న ఓడరేవులో ఆహార ధాన్యాల్ని దింపాయి. అక్కడినుండీ అవి వేలాది ఐరిష్ కుటుంబాలకు చేర్చబడ్డాయి.

దుర్భర పరిస్థితుల్లో, తమను పాలించే బ్రిటీష్ రాణి కూడా తమ గురించి పట్టించుకోకుండా వదిలేస్తే, ఎక్కడో దూరంలో ఉన్న ముస్లిం సుల్తాన్ తమకు సహాయం చేయడాన్ని ఐరిష్ ప్రజలు తమ మనోఫలకం పై భద్రంగా ముద్రించుకున్నారు. ఇప్పటికి కూడా డ్రొగేడాలోని మున్సిపల్ టౌన్ హాల్ లో టర్కిష్ జాతీయ జెండాలోని అర్థ చంద్రాకారం, నక్షత్రం బొమ్మలు ముద్రించి ఉంటాయి. డ్రొగేడా ఫుట్బాల్ క్లబ్ జెండా అచ్చం టర్కిష్ జెండాను పోలి ఉంటుంది.

“ఇస్లామోఫోబియా” – అంటే, ఇస్లాం/ముస్లింలను బూచిగా చూపి, ఆ భయం ఆధారంగానే మనుగడసాగించడం. కొన్ని పార్టీలు,సంఘాలు,ప్రభుత్వాలకు తెలిసిన ఏకైక బతుకు రహస్యం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో, 100% క్రైస్తవులున్న దేశానికి, మరో ముస్లిం దేశం ఆపన్న హస్తం అందించడం అనే విషయం పెద్దగా బయటికి రాకపోవడంలో ఆశ్చర్యంలేదు కదా.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.