నాయకులు – చాణక్యులు- విజేతలు – పరాజితులు!!

చంద్రబాబును రాజకీయ చాణక్యుడిగా కొందరు అభివర్ణిస్తుంటారు. కానీ, చంద్రబాబు జీవితంలో కెల్లా పెద్ద మలుపు – యన్టీఆర్ ని పదవీచ్యుతుణ్ణి చేసాక, మళ్ళీ ఎన్నికలు రాకముందే ఆయన(యన్టీఆర్ ) చనిపోవడం. నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ఆయన బతికివుంటే, ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు తనకు చేసిన ద్రోహాన్ని, వెన్నుపోటుని ప్రజలకు చెప్పి, నాలుగు కన్నీటిబొట్లు రాల్చి ఉంటే, ఆ సానుభూతి సునామీలో చంద్రబాబు కొట్టుకుని పోయిఉండేవారు. అంతటితో చంద్రబాబు రాజకీయ జీవితానికి శుభంకార్డు పడి ఉండేది. కానీ, ఇవేవి జరగక ముందే యన్టీఆర్ జీవితం అర్థఅంతరంగా ముగియడంతో , చంద్రబాబు ఎదురులేకుండా పోయింది.

తెలంగాణా సాధించి, రెండుసార్లు సి.యం గా ఎన్నికైన వ్యక్తిగా కేసీఆర్ ని గొప్ప రాజనీతిజ్ఞుడిగా కొందరు అభివర్ణిస్తుంటారు. కానీ, కేసీఆర్ జీవితంలో గొప్ప మలుపు. వైయస్సార్ మరణం. ఎందుకంటే, వై.యస్ బతికుండగా
జరిగిన ఏ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఎక్కువ సీట్లు సాధించింది లేదు. వైయస్ ఇంకొన్ని నెలలు బతికుంటే, టిఆర్ఎస్ చీలిపోయి, హరీష్ రావ్ కూడా కాంగ్రెస్ లో చేరిపోయి ఉండేవారనేది చాలా మందికి తెలిసిన విషయమే. వైయస్సాఆర్ హఠాన్మరణం తో, కేసీఆర్ దశ తిరిగింది.

ఒకప్పుడు 2 యం.పి లున్న బిజెపిని, దేశాన్నేలే పార్టీగా మార్చడంలో లాల్ కృష్ణ అద్వానీ పాత్ర అత్యంత కీలకమైనది. ఆయన్ని అప్పట్లో చాలామంది లోహ పురుషుడిగా అభివర్ణించారు. అలాంటాయన, పాపం ఇప్పుడు, తన శిష్యుడు మోడీ కనపడ్డ చోటల్లా రెండు చేతులు జోడించి , పాహిమాం అంటూ వేడుకుంటూ తిరుగుతున్నాడు. అప్పట్లో అప్రతిహతంగా సాగిపోతున్న అద్వాని రథయాత్రకు బ్రేకులు వేసి, అద్వానీని అరెస్టు చేయించి , లాలూ ప్రసాద్ సరికొత్త హీరోగా అవతరించారు. అలాంటి లాలూ , ఇప్పుడు జైల్లో ఉన్నారు.

ఈ ఉదాహరణాలన్నిటిని గమనిస్తే, వీరి గెలుపులోగాని, పరాజయాల్లోగాని, వీరి ఒరిజినల్ పాత్ర ఎంత? వీరి ప్రమేయం లేకుండా జరిగే ఇతర సంఘటనల పాత్ర ఎంత?

దీనినే మరో రకంగా విశ్లేషిస్తే .. యన్టీఆర్ మళ్ళీ జనంలోకి వెళ్తారేమో, నెక్స్ట్ ఎలక్షన్ల్స్లో తనని ఓడిస్తారేమో , అని అంత దూరం ఆలోచించకుండా, తెగించి యన్టీఆర్ కుర్చీ లాగేసుకోవడం చంద్రబాబు చేసిన సాహసోపేత పని. దానికి ప్రతిఫలమే ఇప్పుడు ఆయనకు దక్కుతున్న ప్రాభవం అనుకోవచ్చు.

అట్లే, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాల ఆధారంగా పార్టీ స్థాపిస్తే, అది వర్కవుట్ అవుతుందో లేదో, ఉన్న
యంయల్ ఏ పదవి కూడా పోతుందేమో ననే భయం లేకుండా, తెగించి పార్టీ పెట్టడం కేసీఆర్ తెగింపుకు నిదర్శనం. ఆ
తెగింపుకు ప్రతిఫలమే, ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న సి యం గిరి.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మత సంబంధ విషయాల ఆధారంగా రాజకీయం చేస్తే, చరిత్రలో విలన్ గా నిలిచిపోతానేమో ననే భయం లేకుండా, రామమందిర అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చడం , అద్వానీ ముందు చూపుకు నిదర్శనం.
ఆ ముందుచూపుకు ప్రతిఫలమే ఆయన్ను కేంద్ర హోమ్ మంత్రిగా చేసింది.

ఇవన్నీ గమనిస్తే, దైర్యం, సాహసం, తెగింపు లాంటివి.. వీరి రాజకీయ జీవితానికి సోపానాలుగా చెప్పుకోవచ్చు.

ఇక్కడే ఇంకో చిక్కుంది. ఈ లక్షణాలు చూపించినోళ్లందరూ గొప్పోళ్ళయిపోతారా? ఉదాహరణకు.. చిరంజీవి నే తీసుకుందాం. మెగాస్టార్ గా ఓ వెలుగువెలుగుతున్న టైంలో , గెలుస్తాడో, లేదో తెలికున్నా, ఓ రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీచేయడం చాలా రిస్కీ వ్యవహారం. తన సినీ కెరీర్ ని రిస్క్లో పెట్టి, తెగించి ఆయన రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. కానీ ఆయన్ని విజయం వరించలేదు. చివరికి తెరపై మెగాస్టార్ ఇమేజ్ నుండి, పాలిటిక్స్ లో ఫైయిల్డ్ స్టార్ గా, ఫన్నీ స్టార్ గా మిగిలిపోయారు.

ఇది కేవలం రాజకీయాలకు మాత్రమే చెందిన ఫినామినా కాదు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రాస్తారు. చివరికి విజేతలుగా కొన్ని వందల మంది మాత్రమే మిగులుతారు. వారి ఇంటర్వ్యూలు, వారి ఫోటోలు, పేపర్లలో, టీవీల్లో వస్తాయి. నేను ఇన్ని గంటలు చదివాను, ఇలా చదివాను, అలా చదివాను , అని వారు ఇచ్ఛే స్టేట్మెంట్లు , పేపర్లలో హెడ్లైన్స్ గా వస్తాయి. సెలెక్ట్ అయిన ఈ వందలమంది కాకుండా, కేవలం 5 , 10 మార్కుల్లో సెలెక్షన్ మిస్ అయినవారు కొన్ని వేళల్లో ఉంటారు. వారి గురించి ఎవరూ మాట్లాడారు, రాయరు.

మొత్తానికి, సక్సెస్- ఫెయిల్యూర్లు పైకి కనపడేంత స్పష్టమైన, వ్యతిరేక పదాలు కావు. వాటిని కేవలం వ్యక్తిగత లక్షణాలు, ప్రతిభా పాటవాలు, ప్రయత్నాలే కాకుండా, ఇంకా చాలా విషయాలు నిర్దేశిస్తుంటాయి. సమాజం కొన్నిటిని సక్సెస్ గా గుర్తించి అందలమెక్కిస్తుంది, కొన్నిటిని ఫెయిల్యూర్ గా డిక్లెర్ చేసి, నిర్దాక్షిన్యంగా విసిరేస్తుంది. అందుకే, సమాజం నిర్దేశించే ప్రమాణాల్ని కాకుండా, ప్రతివ్యక్తి, తన సొంత ప్రమాణాల్ని, సొంత నిర్వచనాల్ని, సొంత లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అదే సగం విజయం. పరిపూర్ణ శాంతి.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.