పాకిస్తాన్ వెళ్ళిపోండి!!

ఇది ఈ మధ్యకాలంలో ముస్లిములను ఉద్దేశిస్తూ కొందరు కాషాయ మతతత్వవాదుల నోటి ద్వారా ఎక్కువగా చెప్పబడుతున్న ఓ చావకబారు ఉతపదం! సోషల్ మీడియాలో కూడా “మీకంటూ పాకిస్తాన్ అన్న ఓ ఇస్లామిక్ దేశాన్ని ఏర్పర్చుకున్నారుగా మా హిందూ దేశంతో మీకేం పనీ” అంటూ ఇంకా ముస్లిములను ఉద్దేశిస్తూ దేశద్రోహులు వగైరా అంటూ కామెంట్లు పెట్టె చరిత్ర అవగాహన లేని కొందరు అరమెదడు మతోన్మాదుల కామెంట్లు చదువుతూ ఉంటే మతోన్మాదం మనిషిలో మంచీ, మర్యాద, మానవత్వాన్ని, లాజిక్ ను మరీ ఇంత జీరో స్థాయికి పడిపోయేలా చేస్తుందా అని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.

ఇలాంటి చావకబారు స్టేట్ మెంట్లు ఇచ్చే మతతత్వవాదం తలకెక్కిన వారు సంక్షిప్తంగా తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే- అసలు మొట్టమొదట పాకిస్తాన్ వేర్పాటువాద ప్రస్తావన ప్రారంభం అయింది 1937 లో అన్నది.

1937 కు ముందే ముస్లిములు భారతదేశం కోసం ప్రాణార్పణ చెయ్యటం మొదలెట్టారు!

“మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి, మీకంటూ ఓ ఇస్లామిక్ దేశం స్థాపించుకున్నప్పుడు మా హిందూ దేశంతో మీకేం పని?” అంటూ ఇంకా ముస్లిములను ఉద్దేశిస్తూ దేశద్రోహులని, ఉగ్రవాదులని చవకబారు విమర్శలు చేస్తున్న ఎంతమందికి తెలుసు పాకిస్తాన్ స్థాపనకు ముందే బెంగాల్ నవాబ్ “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ అని, టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి ప్రాణాలు అర్పించటం జరిగిందని, టిప్పుసుల్తాన్ చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయని, 1857 లో మొదలైన “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్” అది “గదర్” అన్న పేరుతో వినుతికెక్కిందని అందులో ఒక్క డిల్లీ నగరంలోనే అక్షరాలా 87000 మంది ముస్లిములు బ్రిటీషు వారి చేతిలో చంపబడ్డారని, 1864 నుండి 67 మధ్యలో ముస్లిం తమకు ఎదురు తిరిగారన్న నెపంతో బ్రిటిషర్లు అక్షరాలా 14000 మంది ముస్లిం ఉలామాలను ఉరికంబాలు సరిపోక చెట్ల కొమ్మలకు వ్రేలాడదీసి ఉరి తాళ్లు బిగించి చంపారని, 1929 లో ముస్లిం స్వతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ “ఖుదాయే ఖిత్మత్ గార్ మూవ్ మెంట్” ప్రారంభించారని ఎంతమంది ఈనాటి ముస్లిం ధ్వేషకులైన మతతత్వవాదులకు తెలుసు?

అంతేకాక ఈనాడు “మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి” అంటూ చావకబారు స్టేట్మెంట్లు ఇస్తున్నవారు తెలుసుకోవలసింది- అష్ఫాఖుల్లా ఖాన్, మౌల్వీ అబ్దుల్లాహ్ షా, బఖ్త్ ఖాన్, పీర్ ఆలీ ఖాన్ “తుర్రే బాజ్ ఖాన్” మౌల్వీ ముహమ్మద్ బాకీర్ వాక్కమ్ మజీద్, సైఫుద్దీన్ కిబ్లెవ్, మగ్బూల్ అహ్మద్ అజాజీ, ఆసఫ్ ఆలీ, అబ్బాస్ అలీ, అబ్దుర్రహ్మాన్, మహ్ముద్ అల్హాసన్, సయ్యద్ అల్లావుద్దీన్ హైదరీ లాంటి చరిత్రలో మరుగున పడిపోయిన ఇంకా ఎందరో ముస్లిం వీరులు 200 సం.లు సాగిన బ్రిటీషు ఉగ్రవాదానికి ఎదురు తిరిగి పొరాడి ప్రాణాలు అర్పించకపోయి ఉంటే భారతదేశ స్వతంత్రం పొందటం కల్లోనే కాదు పీడకల్లో సైతం ఊహించటానికి సాధ్యం కాని విషయంగా మారిపోయి ఉండేదనటం అతిశయోక్తి కాదు!

ఇక్కడ గమనించాల్సింది 1947 కు ముందు భారత దేశంలో ముస్లిముల సంఖ్య అతి తక్కువ శాతంలో ఉన్నప్పటికీ ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించేసిన వారిలో 65% ముస్లిములే ఉన్నారు అన్నది. భగత్ సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, సుభాష్ చంద్ర బోస్ లాంటి ఎందరో వీరులతో భుజం భుజం కలిపి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన ముస్లిములెవరికీ అసలు పాకిస్తాన్ ప్రస్తావన తెలీనే తెలియదు.

దాదాపు 200 సం.లు ఇలాంటి ఎందరో వేలకొద్దీ ముస్లిం వీరులు చేసిన ప్రాణత్యాగాలన్నీ పాకిస్తాన్ కోసమో, లేక భారత దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేయ్యటానికో చేసినవి కావు! కేవలం భారత దేశంపై ఉన్న ప్రేమ, ముస్లిముల నరనరాల్లో నిండి ఉన్న జాత్యాభిమానమే వారితో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కాలు దువ్వటాని, ఈ దేశ ప్రజలను కట్టు బానిసలుగా మార్చుకోవటానికి వచ్చిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడటానికి వారి రక్తం ఉరకలు వేసేది.

ముస్లిములను జిహాదీలు, జిహాదీ గాళ్లని వెక్కిరించే మతోన్మాదులకు సైతం తెలియనిది జిహాద్ అంటేనే “చెడుపై చేసే పోరాటం” అని. ఆనాడు అంతమంది ముస్లిములు ఈ దేశం కోసం బ్రిటిషర్ల పై జీహాద్ చేసి ఉండకపోయి ఉంటే బహుశా ఈనాటికీ ఈ దేశంలో బ్రిటిష్ పాలనే సాగుతూ ఉండేదని చెప్పటం కూడా అతిశయోక్తి కాదు.

జాత్యాభిమానం ఈ దేశ ముస్లిముల నరనరాల్లో ఉంది దాని గొప్ప ఆధారం వేలల్లో ముస్లిములు ఈ దేశం కోసం బలిదానాలు చెయ్యటమే కాదు భారతదేశానికి జాతీయవాద నినాదాలన్నీ ముస్లిములు ఇచ్చినవి కావటమే! వాటిని ఈ క్రింది గమనించగలరు.

1.”మాదరే వతన్ భారత్ కి జై” నినాదాన్ని 1857 లో అజీముల్లా ఖాన్ ఇచ్చారు.

2.“జై హింద్” నినాదాన్ని అబిద్ హసన్ ‘సఫ్రానీ’ ఇచ్చారు

3.”ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాన్ని హస్రత్ మోహని ఇచ్చారు

4.భారత్ చోడో” (క్విట్ ఇండియా) నినాదం యూసుఫ్ మెహర్ అలీ ఇచ్చారు

5.యూసుఫ్ మెహర్ అలీ “సైమన్ గో బ్యాక్” నినాదాన్ని కూడా ఇచ్చారు.

6.”సర్ఫరోషి కి తమన్నా, అబ్ హమారే దిల్ మె హై” అనే నినాదాన్ని 1921 లో బిస్మిల్ అజీమాబాది రాశారు.

7.”తరానా-ఎ-హిందీ” ‘సారే జహాన్ సే ఆచ్చా హిందోస్తాన్ హమారా’ ను అల్లామా ఇక్బాల్ రాశారు.

8.సురయ్య తయ్యబ్జీ, ట్రై-కలర్‌ జండాను రూపొందించారు.

కాబట్టి జాత్యాభిమానం అన్నది ఈనాటి మతోన్మాద శక్తులు కొన్ని దిక్కుమాలిన నల్ల చట్టాలు తేవటం వల్ల ఈనాడు ముస్లిముల్లో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు అది కొన్ని వందల, వేల సంవత్సరాలుగా ముస్లిముల నరనరాల్లో ఉరకలు వేస్తూనే ఉంది. ఇవేమీ తెలిసుకోకుండా వక్రీకరించబడిన చరిత్రలు మెదడులో ఎక్కించుకుని, ఒకనాడు దేశాన్ని బ్రిటిషర్లకు తాకట్టు పెట్టటానికి వారి బూట్లు నాకిన సావర్కర్ శిష్యులు ఈనాడు ముస్లిములను ఉద్దేశిస్తూ “పాకిస్తాన్ వెళ్ళిపొండి!” అని, “మా దేశంతో మీకేం పని” అని చెబుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది.

Written By-
Md Nooruddin
[email protected]

Leave a Reply

Your email address will not be published.