పెట్టుబడి పార్టీలు!!

మా అపార్ట్మెంట్ వాచ్ మ్యాన్ వదిలేసి వెళ్ళిపోయాడు. కొత్త వాచ్ మ్యాన్ కోసం వెతుకున్నాం. మొన్నొక వ్యక్తి వచ్చాడు. వాచ్ మ్యాన్ గా ఉంటానన్నాడు. జీతం అక్కర్లేదన్నాడు. పైగా, తానే ఫ్రీగా , అపార్ట్మెంట్ లో అందరి కార్లు కూడా కడిగిపెడతానన్నాడు. వాళ్ళావిడ కూడా అన్ని ఇండ్లలో ఫ్రీగా పనులు చేసిపెడతానని చెప్పింది. ఎందుకిలా చేస్తారని అడిగితే, అపార్ట్మెంట్ జనాల మీద తనకు ప్రేమ అనీ, వారికి సేవ చేయడం తమ జీవిత లక్ష్యం అనీ చెప్పారు. అది సరే, మరి తాము ఆరోగ్యం గా ఉండాలన్నా ఏదైనా తినాలికదా, దానికి డబ్బులు ఎక్కడినుండి వస్తాయి అనీ అడిగితే, అవన్నీ మేం చూసుకుంటాం సార్, మీరు జస్ట్ మమ్మల్ని ఇక్కడ వాచ్ మ్యాన్ లాగా ఉండనిస్తే చాలని చెప్పారు.

వామ్మో, వీడి వాలకం చూస్తుంటే, అపార్ట్మెంట్ లోని కార్లో, లేక అపార్టుమెంట్లోని పిల్లల్నో ఎత్తుకెళ్లి అమ్ముకునే ప్లాన్ తో వచినట్లున్నాడనుకుని, అతనికో దండం పెట్టి వెళ్లగొట్టేసాం.

దేశానికి, దేశప్రజలకూ సేవ చేయడమే తమ జీవితలక్ష్యమని చెప్పే ప్రస్తుత రాజకీయ నాయకుల వైఖరి సరిగ్గా ఇలాగే ఉంటుంది. ఓ పది మంది జనం, ఓ పది కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటేనే కొంత ఖర్చవుతుంది. వారి బండికి పెట్రోలు, డ్రైవర్ ఖర్చులు, అక్కడ తిండి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఈ ఖర్చుల్ని ఆ పదిమంది ఎవరికి వారు పెట్టుకుంటే పర్లేదు. కానీ, వీరి తరుపున ఓ లోకల్ లీడర్ ఎవరో పెట్టుకుంటాడు. ఆ లోకల్ లీడర్ కి ఏంటా అవసరం? ఏఁవుంది, పెజా సేవ. ఓ నాయకుని కారుకు, ముందు ఓ నాలుగు కార్లు, వెనక నాలుగు కార్లు.. పెజా సేవ చేయడానికి ఇంతమంది దేనికి? వీరందరి ఖర్చులు ఎవరు భరిస్తుంటారు? ఇవన్నీ పెజా సేవకేనా? ఈ రకంగా ఖర్చుపెట్టి గెలిచిన వారు, పదవిలోకి రాగానే, ఎదో ఓ మార్గంలో ఆ పెట్టిన ఖర్చుని రికవరీ చేసుకోవాలని చూస్తారు తప్ప, నిజాయితీగా పెజా సేవ చేస్తామంటే బుద్దున్నోడు ఎవరైనా నమ్ముతారా? కానీ, మన స్వాతంత్ర్య భారద్దేశంలో మాత్రం కళ్ళు మూసుకుని నమ్ముతారు. గత 60 + సం, నుండి నమ్ముతూనే ఉన్నారు. పైగా, దేశం ఎందుకిలా ఉందని మళ్ళీ వీళ్ళే గింజుకుంటుంటారు.

మొత్తానికి, ప్రజా సేవ చేద్దామనుకునే పార్టీకి/వ్యక్తులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటి?
వారి ఖర్చులు, ఆదాయమార్గాలు బహిరంగంగా ఉండాలి. పార్టీ మనుగడకి కావలసిన ఆదాయ వనరులు ప్రజల నుండి సమకూరాలి తప్ప, ఒకరిద్దరో, ఓ పది మంది పెట్టుబడిదారుల నుండో రాకూడదు. ఎందుకంటే, పెట్టుబడి పెట్టేవారెవరైనా లాభం కోసమే పెడతారు తప్ప, ప్రజాసేవ చేయాలని పెట్టరు.

ఈ ప్రాధమిక సూత్రం ఆధారంగా చూస్తే, బిజెపి, కాంగ్రెస్, టిడిపి, టిఆర్ ఎస్, వైసిపి, కొత్తగా వస్తున్న జనసేన.. మొదలగు పార్టీలేవీ, ప్రజల నుండి సేకరించిన చందాలతో నడిచే పార్టీలు కావు. తాము ప్రజలకు ఏమేమి చేస్తామో వివరించి, ఎన్నికల్లో పోటీచేయడానికి, ప్రచారం చేయడానికి చట్టప్రకారం ఎంత ఖర్చవుతుందో ప్రజలకు విడమరచి చెప్పి, వారి నుండి చందాలు అడుక్కునే తీరిక వీరిలో ఎవరికీ లేదు. పైగా, జనాలని నమ్మించడం కూడా అంత ఈజీ కాదు. పై పై మాటలకు నమ్మి తమ కష్టార్జితాన్ని ధారాళంగా ఇచ్ఛేయరు. వారు నమ్మాలంటే, కిక్కిచ్ఛే ప్రసంగాల్లో, ఎమోషన్ల డైలాగుల్లో కాదు, నమ్మిన విలువలపై ఆధారపడి జీవితం సాగిస్తున్నామని వారికి కొన్ని సంవత్సరాలపాటు చేసి చూపాల్సి ఉంటుంది. ఇంత కష్టపడ్డా కూడా, వారు అసలు చివరికి నమ్మకనే పోవచ్చు. అప్పుడు, చ.. అనవసరంగా, వీరిని నమ్మించడానికి నా జీవితం వృధా చేసుకున్నానే అనీ నిరుత్సాహపడ కూడదు. కేవలం గమ్యం చేరడం మాత్రమే కాదు, ఆ గమ్యం చేరడానికి నిజాయితీగా వేసే ప్రతి అడుగులోనూ విజయం ఉందని , ఆ నాయకుడు మనసావాచా నమ్మాలి. అప్పుడే, గమ్యాన్ని చేరినా,చేరకపోయినా అదేమంత పెద్ద విషయంగా అనిపించదు.

కానీ, ప్రస్తుత మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు , వారి నాయకులకు ఇంత ఓపిక, విలువలపై నిబద్ధత లేదు. ఎలాగోలా సాధ్యమైనంత త్వరగా అధికారంలోకి రావాలి. దానికి పనికొస్తారనుకుంటే, కావలసిన పెట్టుబడిని సమకూరుస్తారనుకుంటే, ఎలాంటోడినైనా పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ వచ్చ్చినోళ్ళు కూడా, తమ పెట్టుబడికి తగినంత రాబడి వచ్ఛే అవకాశం లేదని తెలిసాక, వచ్చినంత వేగంగా మరో పార్టీలోకి జంప్ చేస్తారు. ఇదే అన్నిపార్టీల్లో జరిగేది.

దీనికి విరుద్ధంగా, కాస్తో కూస్తో విలువల్ని పాటించిన పార్టీలు – కమ్యూనిస్టులు, ఢిల్లీలో ఆప్. ( లోక్ సత్తా కూడా కొన్నాలు ఈ విలువల ఆధారంగానే నడిచింది కానీ, తరువాత జేపీకి కొత్తగా ఐన జ్ఞానోదయం , ఆ పార్టీని శాశ్వతంగా మూతపడేలా చేసింది.) అందుకే, ఈ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, అతి తక్కువ అవినీతి ఉంటుంది. మిగతా ప్రభుత్వాలు వేలకోట్లు ఖర్చుపెట్టి కూడా, చేయలేని పనుల్ని, కేవలం కొన్ని వందల కోట్లతోనే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసి చూపుతుంది. ఎందుకంటే, తమ పెట్టుబడిదారులకు లాభాల్ని తెచ్చ్చిపెట్టే ఆబ్లిగేషన్ ఆ పార్టీలపై లేదు కాబట్టి. తమ పెట్టుబడి దారులు డైరెక్ట్ గా ప్రజలే కాబట్టి.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.