అవును నేను జీహాద్ చేస్తున్నా!!!
=======================
అవును, నేను నిజంగానే జీహాద్ చేస్తున్నా. దీనిలో దాపరికం ఏం లేదు. గత కొన్ని సంవత్సరాల నుండీ చేస్తున్నా. “లా ఇలాహ ఇల్లల్లాహ్-మహమ్మదుర్ రసూలిల్లాహ్ ” -అని మనసుతో పలికినప్పటినుండీ జీహాద్ చేస్తూనే ఉన్నా. మనసుతో అని ఎందుకంటున్నానంటే, దీనిని పెదాలతో చిన్నప్పటినుండీ చెప్తూనే ఉన్నాను. కానీ అప్పుడు అదేంటో తెలీదు. అదేంటో శోధించి, సంఘర్షించి, మధనపడి తెలుసుకున్న తర్వాత, మొదటిసారిగా మనసుతో పలికాను. అప్పటినుండీ దానికి కట్టుబడి ఉండటానికి ప్రతి రోజూ, ప్రతి క్షణం జీహాద్ చేస్తూనే ఉన్నా. నా జీహాద్ పొద్దున 5 గంటలకు మొదలవ్తుంది. వెచ్చటి దుప్పట్లో, కమ్మటి నిద్రకు స్వస్తి చెప్పి ఫజర్ నమాజ్ చదవాలని మనసులోని అలారం గంట కొడుతుంటుంది. ‘మరేం పర్లేదు, అసలే రాత్రి పొద్దుపోయే దాకా ఆఫీస్ పని చేసి అలసి పోయి ఉన్నావ్, ఇంకొంచెం సేపు పడుకో’ – అని శరీరం మొరాయిస్తుంటుంది. అలా జీహాద్ తో నారోజు మొదలవుతుంది.